విభజనను ఆపే అస్త్రమేంటి?

విభజనను ఆపే అస్త్రమేంటి?

రాష్ట్ర విభజనను ఆపే అస్త్రమేమిటి? అలాంటిది ఏమైనా ఉందా? సమైక్యాన్ని కోరుకుంటున్న సీమాంధ్ర ప్రజలను, అక్కడి మేధావులను, ప్రధానంగా  ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న  ఎపి ఎన్జీవోలను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఇది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాం...ఎట్టి పరిస్థితిలోనూ విడిపోనివ్వం...మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం...అంటూ సీమాంధ్రులను మభ్యపెడుతున్న అక్కడి నాయకులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు చాప కింద నీరులా విభజనకు సహకరిస్తుండగా, దింపుడు కళ్లం ఆశల్లో ఉన్న సామాన్య ప్రజలు, ఉద్యోగులు విభజనను అడ్డుకునే అస్త్రం కోసం చూస్తున్నారు. రాజకీయ నాయకుల మీద ప్రజలకు ఇక ఏమాత్రం ఆశలు లేవు. సీమాంధ్ర మంత్రులంతా విభజన జరగక తప్పదని, దాన్ని అడ్డుకునే శక్తి తమకు లేదని, ఇక సీమాంధ్రుల హక్కుల కోసం పోరాడటమే మిగిలిందని చెబుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఎపి ఎన్జీవోలు రాజ్యాంగంలోని ‘371'డి' అధికరణం మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన ఈ ఆర్టికల్‌ దేశంలోని ఏ రాష్ట్రానికీ లేదు. దీన్ని రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా  రాజ్యాంగాన్ని  సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. 1969 జై తెలంగాణ, 1972 జై ఆంధ్రా ఉద్యమాల నేపథ్యంలో 371'డి ఆర్టికల్‌ రాజ్యాంగంలో చేరింది. దీని కథా కమామీషు, పూర్వాపరాలు తెలంగాణ, సీమాంధ్ర ఉద్యగులకు బాగా తెలుసు. ఈ ఆర్టికల్‌ రాష్ట్ర విభజనకు అడ్డుగా ఉందని, దీన్ని తొలగిస్తే తప్ప విభజన సాధ్యం కాదని, దీన్ని తొలగించడం అంత సులభమైన వ్యవహారం కాదని ఎపి ఎన్జీవోలు అంటున్నారు.  371-డి ఆర్టికల్‌ తొలగించే హక్కు లేదా? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జోనల్‌ వ్యవస్థ, పరిపాలనా ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు ఈ అధికరణమే మూలం. పార్లమెంటు ఆమోదంతో, రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేరిన ఈ ఆర్టికల్‌ను తొలగిస్తేనే విభజన ప్రక్రియ ముందుకు పోతుందని, ఆ పని చేయాలంటే పార్లమెంటులో టూ థర్డ్‌ మెజారిటీతో ఆమోదం కావాలని, తరువాత దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాలని, ఇదంత సులభమైన పని కాదని  ఎపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు పదే పదే నొక్కి వక్కాణిస్తున్నాడు. వారం క్రితం కూడా ఆయన ఇదే మాట చెప్పాడు. ఈ ఆర్టికల్‌ రావడానికి తాము ఎన్నో త్యాగాలు చేశామని, ప్రాణాలు పణంగా పెట్టామని అన్నాడు. ఈ ఆర్టికల్‌ తొలగిస్తే మాత్రమే విభజన సాధ్యమవుతుందని, అయితే దీన్ని తీసేసే హక్కు కేంద్రానికి లేదని, ఒకవేళ అలాటి ప్రయత్నాలు చేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పాడు. వాస్తవానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుందని విభజన ప్రక్రియలో పాలు పంచుకుంటున్న కాంగ్రెసు ఢల్లీి పెద్దలు, ‘మాటకారి' దిగ్విజయ్‌ సింగ్‌ కూడా గతంలో చెప్పారు. కాని ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. విభజనకు అడ్డుగా ఉందని చెబుతున్న ఈ ఆర్టికల్‌ గురించి సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు  మాట్లాడటంలేదు. కాంగ్రెసు పెద్దలు రోజుకో మాటా మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర ప్రజలను అయోమయంలో పడేస్తూ ప్రజలతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు.  రాజ్యాంగ సవరణ అవసరమా? కాదా? విభజన ప్రక్రియ మొదటి నుంచీ అనేక రాజ్యాంగ పరమైన సందేహాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంది. కాని ఇప్పటి వరకూ దేనిపైనా సరైన సమాధానం దొరకలేదు. పురాణాలకు, ఇతిహాసాలకు పండితులు ఎవరిష్టం వచ్చినట్లు వారు భాష్యం చెప్పుకునే విధంగా ఎంతో మేధోమథనం చేసి రూపొందించిన రాజ్యాంగంపై ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఎవరికి అనుకూలమైన అభిప్రాయాలు వారు చెప్పుకుంటున్నారు. సామాన్య ప్రజలు తలో రకంగా మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. కాని...సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఢిల్లీ  కాంగ్రెసు పెద్దలు అర్ధంపర్థం లేని మాటలతో అయోమయంలో పడేస్తున్నారు. వారు చెబుతోంది సత్యాలో, అర్థ సత్యాలో, అసత్యాలో తెలియని పరిస్థితి ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా ఆడుతున్న మైండ్‌ గేమ్‌ తప్ప మరోటి కాదు. విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని చెప్పిన కాంగ్రెసు పెద్దలు ఇప్పుడు అది అప్రస్తుతం అన్నట్లుగా  విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. కేబినెట్‌ నోట్‌లోనూ దీనిపై ప్రస్తావన లేదు. రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చినప్పుడు అది తొలగించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమవుతుందా? కాదా? అనే ప్రశ్న కొండలా కాదు, గుదిబండలా ఉంది.  విభజన ప్రక్రియలోని ప్రతీ అంశంపై రాజకీయ నాయకుల్లోనే కాకుండా రాజ్యాంగ, న్యాయ నిపుణుల్లో సైతం భిన్నాభిప్రాయాలున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం అవసరమా, కాదా అనే అంశం దగ్గర్నుంచి రాజ్యాంగ సవరణ వరకు ఏ అంశంపైనా క్లారిటీ లేదు. నాయకులెవరూ దీనిపై క్లారిటీ ఇవ్వలేరు కాబట్టి,  ఎవరైనా కోర్టుకు వెళితే అక్కడ తేలాలి. రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్లు వీగిపోయాయి. కాబట్టి ఎవరైనా 371'డి ఆర్టికల్‌పై కోర్టుకు వెళితే దీనిపై క్లారిటీ రావొచ్చు. ఎపి ఎన్జీవోలు ఆ పని చేస్తుండవచ్చు. 1969, 1972 వేర్పాటువాద ఉద్యమాల తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల స్థానికతను నిర్ధారించేందుకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371'డి రాజ్యాంగంలో చేరింది. ఈ అధికరణంలోని 9ఎ, 9బి నిబంధనల్లో ‘హైదరాబాద్‌' రాష్ట్రం ప్రస్తావన కూడా ఉంది. హైదరాబాద్‌ రాష్ట్రమంటే సీమాంధ్రతో కూడిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకముందున్న రాష్ట్రం. కాబట్టి రాష్ట్ర విభజన జరగాలంటే 371'డి పూర్తిగా తొలగిస్తేనే సాధ్యమవుతుందని,  తొలగించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని చెబుతున్నారు. ఇలాంటి ఆర్టికల్‌ మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాబట్టి ఎన్‌డిఎ సర్కారు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఇబ్బందులు ఎదురుకాలేదు.  విభజనతోనే ఆర్టకల్‌ కనుమరుగు? రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏర్పాటైన 371'డి అధికరణానికి ఎంతో విలువుందని ఎపి ఎన్జీవోలు చెబుతుండగా, విభజన జరగడంతోనే ఆ అధికారణం కనుమరుగైనట్లేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఏ రాజ్యాంగ సంప్రదాయాలను పట్టించుకోకుండా విభజనపై దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెసు అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్‌ 371'డి తెలియకుండా ఉండదు. దీనిపై రాజ్యాంగ నిపుణులను సంప్రదించకుండా ఉండదు. వారేం సలహా ఇచ్చారో తెలియదు. అయితే రాజ్యాంగ సవరణకు, సాధారణ చట్టాలకు తేడా ఉందని, రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన ఆర్టికల్‌ను ఎత్తేయాలంటే మళ్లీ రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమని కొందరు చెబుతున్నారు. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం వస్తే పాత చట్టానికి ఆటోమేటిగ్గా విలువ పోతుందనేది చట్టాలకు వర్తిస్తుంది గాని, రాజ్యాంగ పరమైన అంశాలకు కాదని అంటున్నారు. ఇందుకు మిజోరం రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 1971లో ఆ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు 371 ఆర్టికల్‌ను రాజ్యాంగ సవరణ ద్వారానే తొలగించారు.  ప్రస్తుత 371'డి ఆర్టికల్‌లో పాత హైదరాబాద్‌ ప్రస్తావన కూడా ఉంది కాబట్టి ఆ అంశాలను కూడా తీసేయాల్సి ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 371'డి ని పట్టించుకోకుండా పార్లమెంటులో బిల్లు పెట్టి, అది ఆమోదం పొందినప్పటికీ ఈ ఆర్టికల్‌ విషయంలో రాష్ట్రపతి ప్రశ్నించవచ్చని ఎపి ఎన్జీవోలు చెబుతున్నారు. అప్పుడైనా ఇది చర్చనీయాంశం కాకతప్పదు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రపతిగా ఉండటంతో సమైక్యాన్ని కోరుకుంటున్నవారు ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. బిల్లుకు ఆయన ఏదో ఒక కొర్రీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే నమ్మకంతో ఉన్నారు.  ఉమ్మడి రాజధానికీ సవరణ అవసరమే! కేవలం రాష్ట్ర విభజన ప్రక్రియకే కాకుండా ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేయాలన్నా 371'డి అధికరణాన్ని సవరించాల్సిందేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూనియన్‌ టెరిటరీ'యుటి) ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి రాజధాని (కామన్‌ కేపిటల్‌) అనేది కొత్త కాన్సెప్ట్‌. కేబినెట్‌ నోట్‌లోనూ ప్రభుత్వం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించింది. ఉమ్మడి రాజధాని ఆలోచనపై ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలోనూ వ్యతిరేకత వస్తోంది. దీనిపైనా క్లారిటీ లేదు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌ సైతం జోకులు వేస్తున్నారు. అయినా కాంగ్రెసుగాని, కేంద్రం గాని పట్టించుకోవడంలేదు. సీమాంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం కోసం భవనాలు వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో డెబ్బయ్‌ రోజులకు పైగా ఉద్యమం సాగినా కాంగ్రెసుకు, కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులంతా సోనియా గాంధీకి లొంగిపోయారని , అమ్మ చెప్పినట్లే వింటామని తలలూపుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి కొన్ని ఆధికరణాల అయోమయం 371'డి మాత్రమే కాకుండా రాష్ట్రాలపై కేంద్రం అధికారాలకు సంబంధించి 249, 250, 252, 258(ఎ) అధికారణలూ అయోమయం సృష్టిస్తున్నాయి.  ఉమ్మడి  రాజధానికి ఈ అధికరణాలన్నీ ఎలా వర్తింపచేస్తారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి రాజధానిగా తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో, విధివిధానాలేమిటో, కేంద్రం పాత్ర ఏమిటో ఇప్పటివరకు స్పష్టత లేదు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కాంగ్రెసు, కేంద్ర ప్రభుత్వమూ సరైన కసరత్తు చేయకుండానే ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నాయన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. విభజన జ్వాలల్లో ఎవరు తగలబడిపోతారో, ఎవరు బతికి బయటపడతారో చూడాలి.  -