Modi 5 Year Era has just started. Bharatiya Janata Party came to power with full majority

Modi 5  Year Era has just started. Bharatiya Janata Party came to power with full majority

నరేంద్ర మోదీని గుజరాత్‌కు పంపించింది వాజపేయి, ఆడ్వాణీలే. మోదీ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడల్లా ఆడ్వాణీ, వెంకయ్య, సుష్మా, అరుణ్ జైట్లీ ఆయనను కాపాడారు. వాజపేయిని సైతం ప్రక్కకు పెట్టారు. కేశూభాయి పటేల్, వాఘేలాలను ఎదుర్కొనేందుకు సహాయపడ్డారు. గుజరాత్‌కు వెళ్లి మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. మోదీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగేందుకు ఈ బృందమే కారణం. ఇప్పుడు మోదీ విశ్వరూపం ముందు వారిని వెదుక్కోవడం కష్టం.

కేంద్రంలో అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఒక పరిణామ క్రమం. ఒక కొత్త చరిత్ర. రాబోయే రోజుల్లో అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు దారితీసేందుకు అవకాశం ఉన్న వినూత్నఘట్టం. ఇక సర్కార్‌లను కాపాడుకోవడానికి ఎంపీలను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. పార్లమెంట్ సభ్యులు సభలోనే నోట్లకట్టలను ప్రదర్శించే ఘట్టం పునరావృతం కాదు. ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఎటువంటి విధాన నిర్ణయాలనైనా తీసుకునేందుకు వెనుకాడవలసిన అవసరంలేదు. ఇది కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కాదు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అయితే బీజేపీకి మెజారిటీ సీట్లు లభించే అవకాశం లేదు. ఇది పూర్తిగా బీజేపీకి అనుకూల వోటు. అని నరేంద్రమోదీ తనను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న వెంటనే స్పష్టం చేశారు.

మోదీకి చాలా మంది వ్యతిరేకులు ఉండవచ్చు. బీజేపీకి కేవలం 31 శాతం ఓట్లు వచ్చాయని మిగతా 69 శాతం అంతా మోదీకి వ్యతిరేకులని తృప్తి చెందవచ్చు. మోదీకి మద్దతునిచ్చేవారిని దూరం పెట్టి వారితో మాట్లాడబోమని ప్రకటించి వికార ఆనందం పొందవచ్చు. కానీ కేవలం మోదీని ద్వేషించినంత మాత్రాన జరిగిన పరిణామాన్ని తుడిచిపెట్టడం అసాధ్యం. ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రధానం కాదు, ఎన్ని సీట్లు వచ్చాయన్నది ప్రధానం. ఆ సీట్లతో మోదీ తాను చేయగలిగినన్ని పనులు చేయగలరా అన్నది ప్రధానం. మోదీకి అనుకూలంగా ఓటు వేయనంత మాత్రాన వారంతా మోదీని వ్యతిరేకిస్తున్నట్లు భావించడం కూడా కుతార్కికం. కేవలం 200 ప్లస్ సీట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చేయగలిగినన్ని అరాచకాల్ని చేసింది. అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చింది. భారీ ఎత్తున అవినీతి కుంభకోణాలకు పాల్పడింది. ఎదురుతిరిగిన వారిని అణిచేసే ప్రయత్నం చేసింది. విచ్ఛిన్నకర చర్యలకు పూనుకుంది. ఏమి చేసినా అన్నిటికీ తల ఊపే ఒక అసమర్థుడితో పాలన చేయించింది. మాట్లాడడం కూడా రాని ఒక అర్భకుడిని దేశంపైకి రుద్దాలని ప్రయత్నించింది. ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్, సిక్కుల ఊచకోత, శ్రీలంకలో తమిళుల ఊచకోత, పలు మతకల్లోలాల ద్వారా జీవన విధ్వంసానికి కారణమైంది. ఆదివాసీ మహిళలపై అత్యాచారాలను సమర్థించింది. గిరిజనుల జీవితాల్లో కల్లోలం సృష్టించింది. ఒకటా, రెండా కాంగ్రెస్ సర్కార్లు చేసిన అరాచకాలు? నరేంద్రమోదీని కాదనడం ద్వారా, ఆయనను వ్యతిరేకించడం ద్వారా, ఆయనను అడ్డుకోవడానికి ఒడ్డున నిలబడి ప్రవచనాలు చెప్పడం ద్వారా ఎవరైనా ఏమి సాధించాలనుకున్నారు? మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికి సంతోషం కలిగేదా? పోనీ ఈ పరిణామం రాకుండా వారేమైనా ప్రజల్లో చైతన్యం తెచ్చారా? కోట్లాది ఓటర్లు ఒప్పుకునే ప్రత్యామ్నాయం ఏమైనా చూపించారా? వైఫల్యానికి ద్వేషం జవాబు కాదు.

ఏమి ఫలితాలివి? ఎన్నికలకుముందు పలు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో నరేంద్రమోదీ, అమిత్ షాలిద్దరూ సునామీ వీస్తుందని చెప్పారు. బీజేపీ స్వంతంగా మెజారిటీ సాధిస్తుందని, ఎన్డీఏకు 300 సీట్లకు పైగా వస్తాయని ప్రకటించారు. అలాగే జరిగింది. ఉత్తరాదిన ఒక రకంగా సునామీయే. దాదాపు 200 సీట్లు ఉత్తరాది నుంచే లభించాయి. విచిత్రమేమంటే బీసీలు, మైనారిటీల ఓట్లను నమ్ముకున్న సమాజ్‌వాది పార్టీ, దళితులు, బ్రాహ్మణులను నమ్ముకున్న మాయావతిపార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 42శాతం ఓట్లు బీజేపీకి లభిస్తే బీఎస్‌పీ, ఎస్‌పీ కలిసి దాదాపు చెరి 20శాతం ఓట్లు సంపాదించుకున్నాయి. బీహార్‌లో కూడా 30శాతం ఓట్లు బీజేపీవే. ఈ ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే కుల సమీకరణలకు అతీతంగా బీజేపీకి ఓట్లు లభించాయని అర్థం. నిజానికి బీజేపీ పునాది కుల రాజకీయాలను వ్యతిరేకించడం ద్వారా పడి ంది. బీజేపీకి మతమే కులం. గుజరాత్‌లో రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారానే బీజేపీ ఆ రాష్ట్రంలో నిలదొక్కుకుంది. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు వ్యతిరేకంగానే ఆడ్వాణీ రథయాత్ర చేపట్టారు. ఆ తర్వాతే బీజేపీ బలం 2 నుంచి 85 సీట్లకు పెరిగింది. పాశ్వాన్‌తోను, అప్నాదళ్ వంటి పార్టీలతో చేతులు కలపడం ద్వారా చిన్నా చితక కుల సమీకరణలు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పుడు నరేంద్రమోదీకి వచ్చిన ఓటు కులసమీకరణలకు అతీతమైనది. కులాల, వర్గాల పరిధులను దాటి మోదీ ప్రభంజనం చొచ్చుకుపోయింది. అందుకే బీఎస్‌పీ ఉత్తరప్రదేశ్‌లో ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది. ఒకప్పుడు మాయావతితో చేతులు కలపడం ద్వారా తన బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు ఆమెనే దెబ్బతీయగల స్థాయికి చేరుకుంది. నిజానికి ఇలాంటి వ్యూహాలను బీజేపీ తాను బలంగాలేని అనేక రాష్ట్రాల్లో అవలంబించి చివరకు స్వంతంగా అధిక సీట్లు సంపాదించుకోగల స్థితికి చేరుకుంది.

బీహార్‌లో జనతాదళ్ (యు) కూడా ఇప్పుడు బీఎస్‌పీ మాదిరే తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఒడిషా ప్రాంతీయ పార్టీ అయిన బిజూ జనతాదళ్‌ను మినహాయిస్తే విచిత్రమేమంటే ఒకప్పుడు దేశంలో ప్రభుత్వాన్ని ఏలిన జనతాదళ్ ఇపుడే పరిస్థితిలో ఉన్నది? కర్ణాటకలో జనతాదళ్(ఎస్) రెండు సీట్లు గెలుచుకుంటే, బీహార్‌లో జనతాదళ్ (యు) రెండు సీట్లను గెలుచుకుంది. ఈ పార్టీలు ఆయా రాష్ట్రాలలో ఏదో ఒక సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు. ఇక దేశంలో వామపక్షాల స్థితి ఏమిటి? మొత్తం పది సీట్లు. పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ఏలిన సీపీఐ(ఎం)కు రెండు సీట్లు లభించాయి. అక్కడ నాలుగు సీట్లు సాధించిన కాంగ్రెసే నయం. ఇవి దేశంలో వామపక్షఐక్యత గురించి మాట్లాడుతూనే తమను తాము ఓడించుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. అంటే కుల రాజకీయాలను, వామపక్ష రాజకీయాలను ప్రజలు వదిలించుకునే క్రమంలో ఉన్నారా? మోదీ అన్నట్లు ఇదికేవలం కాంగ్రెస్ వ్యతిరేకత మాత్రమే కాదు. సిద్దాంతాలను మాట్లాడుతూనే ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రజలకు చూపలేని అరాచక పార్టీల పట్ల వ్యతిరేకత. ములాయం, మాయావతి, లాలూప్రసాద్‌యాదవ్ వంటి నేతల కులరాజకీయాలకు కాలం చెల్లుతున్నదన్నడానికి సంకేతం. ఈ కులరాజకీయాల వల్ల దళితులకు, వెనుకబడిన వర్గాలకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా అన్న ప్రశ్నలు ఆయా వర్గాలే వేసుకున్నట్లు కనపడ్డాయా అన్నట్లుగా ఈ ఎన్నికలు జరిగాయి. ఒక వ్యక్తికి అనుకూలంగా వచ్చిన ప్రభంజనం ఇన్ని పరిధులను చెరిపివేయడం అంటే సామాన్యం కాదు. అంటే కులసమీకరణలు భవిష్యత్తులో పనిచేయవని అర్థం కాదు. కానీ మోదీ ప్రభంజనం ఏ సమీకరణలనూ పనిచేయని స్థితికి నెట్టివేసింది. పోనీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆరోపించినట్లు మత ప్రాతిపదికగా మోదీ సమాజాన్ని విడదీశారా? హిందువుల ఓట్లన్నీ మోదీకే వచ్చాయా అన్న ప్రశ్నకు కూడా ఆస్కారం లేదు. అలా ఒప్పుకుంటే కులతత్వాన్ని మతతత్వం చెరిపివేసిందని ఒప్పుకోవాలి.

ముజఫర్‌నగర్‌లో అల్లర్లు జరిగాక ఆ ప్రాంతంలో వోటర్లు ఇరు వర్గాలుగా విభజనకు గురి అయి ఉండవచ్చు. కానీ దేశ వ్యాప్తంగా ఒకే ధోరణి కనపడుతున్నదంటే మతప్రాతిపదిక ప్రభావమే పూర్తిగా మోదీ విజయానికి కారణం కాకపోవచ్చు. మోదీ విషయంలో భారీ మార్కెటింగ్ జరిగి ఉండవచ్చు. మీడియా ఆయనను సమర్థించి ఉండవచ్చు. కాంగ్రెస్‌కు కూడా మార్కెటింగ్ వనరులకు కొరత లేదు. అయినప్పటికీ అనేక ఇతర పార్టీలకంటే మోదీ ఆధ్వర్యం వహిస్తున్న బీజేపీలో ప్రత్యేకత ఏమిటో ఓటర్లు చూసి ఉండాలి. ఆయనకు ఆధికారం అప్పజెబితే ఏదో మార్పువస్తుందని వారు భావించి ఉండాలి. ముఖ్యంగా యువత, మధ్యతరగతి తమ జీవిత సమస్యలకు మోదీయే పరిష్కారమన్నట్లుగా భావించారు. మోదీ కుల పార్టీలను, వామపక్షాలను దెబ్బతీశారు కానీ ప్రాంతీయ పార్టీలను పూర్తిగా దెబ్బతీయలేకపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంను, ఒడిషాలో బిజూజనతాదళ్‌ను, తమిళనాడులో అన్నాడీఎంకేను, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజలు ప్రాంతీయ పార్టీల పట్ల తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. మొత్తం లోక్‌సభలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన సీట్లు దాదాపు నాలుగోవంతు ఉం టాయి. ఈ ప్రాంతీయ పార్టీలు స్థానిక ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబాలు.

ఎవరెన్ని అన్నా బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. అయినప్పటికీ తాము తమతో ఉన్న ఎన్డీఏలో పార్టీలతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తామని మోదీ ప్రకటించారు. అదేసమయంలో కనీస ఉమ్మడి కార్యక్రమం అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.

రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ రావడానికి ఇంకా సమయం ఉన్నది. పూర్తి మెజారిటీ వచ్చినందువల్ల బీజేపీ, దానివెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ తమ సిద్దాంతాల వ్యాప్తిని వేగవంతం చేయడానికి ఉబలాటపడవచ్చు. కానీ మోదీ ముందుగా పాలనమీద దృష్టి కేంద్రీకరించి, ప్రజల్లో నమ్మకం కుదిర్చిన తర్వాతే ఇతర అంశాలను పట్టించుకునే ఆస్కారం ఉన్నది. మోదీ పట్ల భ్రమలు తొలగిపోయేందుకు ఆస్కారం ఇస్తారా అన్న దానిపైనే ఇతర పార్టీల మనుగడ ఆధారపడి ఉన్నది.

ఏన్డీఏలోని ఇతర పార్టీలకైనా, బీజేపీలో సీనియర్లకైనా నరేంద్రమోదీని ఆమోదించడం కన్నా వేరే మార్గం లేదు. ఎందుకంటే మోదీ సృష్టించిన ఊపు వల్లే ఈ ఫలితాలు లభించాయి. బీజేపీలో ఆడ్వాణీ నేత తొలుత మోదీ నేతృత్వం పట్ల అభ్యంతరం వ్యక్తపరిచినప్పటికీ ఇప్పుడు ఫలితాల తర్వాత సంతోషం పట్టలేకపోయారు. ఎంతైనా మోదీని గుజరాత్‌కు వాజపేయి, అద్వానీ ఇద్దరూ కలిసి పంపించారు. మోదీ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడల్లా ఆడ్వాణీ, వెంకయ్య, సుష్మా, అరుణ్ జైట్లీ ఆయనను కాపాడారు. వాజపేయిని సైతం ప్రక్కకు పెట్టారు. కేశూభాయి పటేల్, వాఘేలాలను ఎదుర్కొనేందుకు సహాయపడ్డారు. గుజరాత్‌కు వెళ్లి మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. మోదీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగేందుకు ఈ బృందమే కారణం. ఇప్పుడు మోదీ విశ్వరూపం ముందు వారిని వెదుక్కోవడం కష్టం.